తాజా లోకల్ ఈవెంట్స్
Search

చిరునవ్వు వెల ఎంత?

*** చిరునవ్వు వెల ఎంత? ****

నాలుగు రోజుల క్రితం చూశానాయన్ని. ఉదయం వాకింగులో ఎదురయ్యాడు. డెబ్బై ఏళ్ల వయసుకి నప్పని బెర్ముడా, టీషర్టు. ఎవరి మీదో అలిగినట్లు ముఖం ముటముటలాడుతోంది. నన్ను చూడగానే ముఖం పక్కకి తిప్పుకున్నాడు. కాకతాళీయం అనుకుందును, మర్నాడు కూడా అలాగే జరక్కపోతే!
మూడో రోజున ఆయన్ని చూస్తూనే నేనే ముఖం పక్కకి తిప్పుకున్నాను. ఉక్రోషం కొద్దీ అలా చేశాను కానీ, వెంటనే తప్పు చేశానేమో అన్న భావన నాలో. కావాలనే ముఖం తిప్పేసుకున్నట్లు తెలిసిపోయిందేమో! నొచ్చుకున్నాడేమో! ఆయన ముఖం తిప్పుకున్నప్పుడు మరి నేను నొచ్చుకోలేదా అనుకున్నాను కానీ మనసుకి తృప్తిగా అనిపించలేదు.
కారణం నాకు తెలుసు.
తెల్లవారి లేవగానే శుభోదయం అనడం సంప్రదాయం కావచ్చు. నాకు మాత్రం ప్రతి ఉదయం శుభోదయమే!
లేచి బ్రష్ చేసుకుని, షేవింగ్ కూడా అయ్యాక ట్రాక్ సూట్‌లో బయల్దేరతాను వాకింగుకి.
నాకో రూటుంది. సుమారు గంటసేపు నాలుగు కిలోమీటర్లకి తక్కువ కాకుండా వీధులన్నీ తిరుగుతాను.
ఇంటి తలుపు తియ్యగానే కోయిల కుహూమంటుంది. మరేవో పక్షులు కువకువమంటాయి. నిండా ప్రకృతి సరిగమలే. నెమలి కూత కలగలిసినపుడవి రెహమాన్ ‘వందేమాతరం’కి దీటొస్తాయి.
వీధి గేటు తియ్యగానే ఇంటి ముందు నేరేడు చెట్టు. ఉడత ఒకటి నాకేసి చూసి చెట్టెక్కేసింది. దాని చూపులే నాకు పలకరింపు. తొండ ఒకటి నాతో దాగుడుమూత లాడుతుంది.
రోడ్డు మీద అడుగెట్టగానే పీల్చుకోమంటూ పచ్చిగాలి. మామూలు గాలి కాదది. వేపగాలి. మా కాలనీ నిండా వేప చెట్లే! వాటి గాలి తాకిడి డాక్టరు ప్రియ స్పర్శలా ఉంటుంది.
ప్రశాంతమైన కాలనీ మాది. అన్నీ విడి ఇళ్లు. ప్రతి ఇంట్లోనూ, ఇంటి ముంగిటా పళ్ల చెట్లు, పూల మొక్కలు. సర్వాలంకార భూషితంగా, పచ్చగా, మనోహరంగా, మమ్మల్ని చూడ్డమే ఓ ఎంటర్టయిన్‌మెంట్ అన్నట్లుంటాయవి.
దారిలో వీధి కుక్కలు. నేను కనపడగానే మర్యాదగా పక్కకి తప్పుకుని దారిస్తాయి. కొన్నిళ్లలో పెంపుడు కుక్కలు. నన్ను చూడగానే పరుగుపరుగున ఫెన్సింగు దాకా వచ్చి స్నేహపూర్వకంగా మొరుగుతాయి. చూశాను సుమా అన్నట్లు అరచేయి చూపించేవరకూ అవి మొరగడం ఆపవు.
దారిలోనే మోర్ మినీ సూపర్‌మార్కెట్ ఉంది. దుకాణం తెరవడానికి వచ్చిన చిన్న పిల్లలు చూడముచ్చటగా ఉంటారు. చిరునవ్వుతో కూడిన వాళ్ల పలకరింపు వ్యాపార బంధానికి అతీతమై అలరిస్తుంది.
ఆ సమయంలో నాకులా వాక్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. ఒకాయనైతే పరుగెడుతున్న వాడు పరుగు ఆపకుండానే, అంత దూరాన్నుంచే నన్ను చూసి, మందహాసం చేసి, రెండు చేతులూ జోడించి నమస్కరిస్తాడు. ఆయాసపడుతున్న ఆయన్ని చూస్తే, కనిపించి ఇబ్బంది పెడుతున్నానేమోనని నాలో గిల్టీ ఫీలింగ్.
కొందరు గుంపులుగా, కొందరు జంటగా, కొందరు నాకులా ఒక్కరుగా...
కొందరు పిల్లలు, కొందరు యువతీ యువకులు, కొందరు నాకులా వృద్ధులు...
కొందరు దగ్గర్లోని జిమ్ నుంచి వస్తూ, కొందరు ఈతకొలనులో ఈది వస్తూ, కొందరు టెన్నిసో షటిలో ఆడి వస్తూ, కొందరు డివైడర్లలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ...
అందరూ నన్ను చూసి నవ్వుతారు. వారిలో ఎవరు కనపడకపోయినా, కనపడితే నవ్వకపోయినా ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపిస్తుంది.
వాకింగ్ లేకపోతే ఇంచుమించు వాళ్లంతా అపరిచితులే. ఈ పరిచయం కూడా వాకింగ్‌లో చిరునవ్వుల వరకే. బాదరాయణ సంబంధంలా ఇది వాకింగ్ అనుబంధం.
పెత్తెక్ష నారాయణుడి దర్శనమయ్యేలోగానే ఇల్లు చేరుకుంటాను తృప్తిగా. నాలుగు రోజులుగా నేనా తృప్తికి దూరమయ్యాను. కారణం - నన్ను చూసి చిరునవ్వు చిందించని మొదటి వ్యక్తి ఆయన.
రోజూ ఈ విషయం మా ఆవిడకి చెబుతున్నాను. మామూలుగా ఐతే తనూ రోజూ నాతో వాకింగుకొచ్చేది. నెల్లాళ్ల నుంచి కాలు నొప్పని ఇంట్లోనే యోగా చేస్తోంది.
మొదటి రోజు లైట్ తీసుకుంది. రెండో రోజు అయ్యో పాపమని నొచ్చుకుంది. మూడో రోజు ‘అదేం మనిషండీ ఆయన’ అని చిరాకుపడింది. నాలుగో రోజు నేనింటికి రాగానే ‘ఆయన పేరు పరబ్రహ్మమండీ. కాలనీకొచ్చి పది రోజులయిందిట. నిన్ననే మన యశోద వాళ్లింట్లో పనికి కుదిరిందిట’ అంది.
పాపం, మా ఆవిడ కూడా నా మనోవ్యధని అర్థం చేసుకుని ఆయన ఆచూకీ తియ్యడానికి ప్రయత్నం చేస్తోందన్న మాట! ఇప్పుడు ఇద్దరిళ్లలోనూ ఒకే పనిమనిషి ఐతే కూపీ లాగడం ఎంతసేపు!
ఇద్దరు కొడుకులుట ఆయనకి. పెద్దకొడుకు ఆస్ట్రేలియా. చిన్న కొడుకు దుబాయి. రిటైరయ్యేక కొన్నాళ్లు పెద్దకొడుకు దగ్గరా, కొన్నాళ్లు చిన్నకొడుకు దగ్గరా ఉంటూ వచ్చేట్ట. ఇక అక్కడుండలేక ఈ కాలనీలో ఇల్లు కొనుక్కున్నాట్ట. రాగానే పెళ్లానికి పెద్ద జబ్బు చేసి అపోలోలో ఐసియులో పెట్టారుట. కొడుకులిద్దరూ ఇప్పుడిక్కడే ఉన్నారుట. ఇంట్లో వాళ్లు రోజూ వంతుల వారీగా హాస్పిటల్‌కి వెళ్లొస్తున్నారుట.
నిజానికిదంతా మా ఆవిడ నాకు రెండు మూడు రోజుల క్రితమే చెప్పింది. అప్పుడు యథాలాపంగా విన్నాను. ఇప్పుడు ఆయనదని తెలిసేక మొత్తం కథ బుర్రకెక్కింది. ‘అయ్యో పాపం’ అనుకున్నాను అప్రయత్నంగా.
మర్నాడు వాకింగులో ఆయన కనపడలేదు. ఇంకా ఆయనకీ నాకూ పరిచయం ఏర్పడకపోయినా, ఎందుకో మిస్సయినట్లు తోచింది. హాస్పిటల్లో ఆయన భార్య ఎలా ఉందోనని భయపడ్డాను కూడా. కానీ మా యశోద ఉందిగా - ఆ రోజు ఆయనది మార్నింగ్ డ్యూటీ అని తెలిసింది. అంతేకాదు. ఆశలన్నీ వదులుకున్న సమయంలో ఏమద్భుతం జరిగిందో, ఆయన భార్య పూర్తిగా మామూలు మనిషయిందిట. పదేళ్ల దాకా ఏ జబ్బూ ఆవిణ్ణి కనె్నత్తి చూడలేదని డాక్టర్లు భరోసా ఇచ్చారుట. ఇంటిల్లపాదీ మహా సంబరంగా ఉన్నారని చెప్పిందిట యశోద.
కాళిదాసు కవిత్వానికి నా పైత్యం కొంత టైపు మా యశోద. అది చెప్పేదంతా యథాతథంగా తీసుకోనక్కర్లేదు. కానీ పరబ్రహ్మం ఇంట్లో విషాదపు తెరలు తొలగిపోయాయని చెప్పొచ్చు.
మర్నాడు వాకింగుకి బయల్దేరినప్పుడు పిట్టమ్మలు, ఉడతమ్మ, తొండమ్మ, పచ్చిగాలి వగైరాలని పట్టించుకోకుండా ఆయనే్న తల్చుకుంటూ అడుగులు వేశాను. ఇన్నాళ్లూ భార్య ఆరోగ్యాన్ని తల్చుకుంటూ దిగులుగా ఉండేవాడేమో. నేనది ముటముట అనుకున్నాను. ఇప్పుడాయన ముఖంలో చిరునవ్వు చూడాలని తహతహగా ఉంది నాకు.
పరబ్రహ్మాన్ని దూరాన్నుంచే గుర్తు పట్టాను. నా వాక్‌మేట్సులో ఆ బెర్ముడా, టీ షర్టు కాంబినేషన్ ఆయనకి మాత్రమే సొంతం. ఆయన్ని సమీపిస్తుంటే గుండె
కాస్త వేగంగా కొట్టుకుంది.
నవ్వుతాడా?
ఆలోచిస్తుండగానే ఆయన నన్ను దాటి వెళ్లిపోయాడు. నాకేసి ఓసారి చూశాడు కానీ నన్ను చూసినట్లు అనిపించలేదు. ఆ చూపులు నన్ను చీల్చుకుని నా వెనుకనున్న మరి దేన్నో చూడబోతున్నట్లు అనిపించింది. ముఖంలో చిరునవ్వు లేదు సరికదా, అదే ముటముట.
అప్పుడు నాకో అనుమానమొచ్చింది. చాలాకాలంగా భార్య అనారోగ్యంతో ఉంది. ఈయన చూస్తే పిడుగులా ఉన్నాడు. ఏదైనా ఎఫైర్ పెట్టుకున్నాడేమో! ఆ మధ్య వార్తల్లో చదివాను. డెబ్బయ్యేళ్ల వయసులో ఒకాయన భార్యకి విడాకులిచ్చి, పాతికేళ్ల పిల్లని చేసుకున్నాట్ట. మొదటి భార్యకి మస్తుగా భరణం ఇస్తున్నాడేమో, ఆవిడ కూడా ఇదే బాగుందని ఊరుకుందిట.
ఆయనదీ అలాంటి కేసేమో. భార్య హాస్పిటల్లో ఉందని కాదు, ఆరోగ్యం కుదుటపడి తిరిగిస్తుందని ఇన్నాళ్లూ ఆందోళన పడ్డాడు. ఆవిడ తిరిగొస్తే, అది డాక్టర్లకి అద్భుతం కానీ, ఆయనకి అశనిపాతమే!
నా మనసులో ఏ మాటైనా మా ఆవిడకి చెప్పుకునేదాకా తోచదు నాకు.
నేనన్నది విని, ‘ఏం మనిషండీ మీరు. ఆయన చాలా పుణ్యాత్ముడు. తనకి పిల్లలున్నా సరే, ఓ అనాథ పిల్లని కూతురిగా దత్తత చేసుకుని, ఎంబీబీఎస్ చదివించాడు తెలుసా? హాస్పిటల్లో ఆ అమ్మాయుండడం వల్లే, ఆయన భార్యకి స్పెషల్ ట్రీట్‌మెంట్ జరిగి బ్రతికి బట్టకట్టింది’ అని మందలించింది మా ఆవిడ.
సిగ్గు పడ్డాను. ఏం చేస్తాం? బ్రెయినొక టీవీ ఛానెల్. ఇరవై నాలుగ్గంటలూ ప్రసారాలు కావాలంటే కొత్త వార్తలు ఎక్కణ్ణించొస్తాయ్ - సృష్టించుకుంటే తప్ప!
మర్నాడు వాకింగులో పరబ్రహ్మాన్ని గౌరవపూర్వకంగా చూసి నా తప్పు దిద్దుకుందామనుకున్నాను. కానీ ఆయన ముఖంలో ముటముట చూడగానే నా మనసు మారిపోయింది.
రోజుకొకటిగా వాళ్లింటి కబుర్లు నాకు తెలుస్తూనే ఉన్నాయి.
ఒకసారి గొప్ప లాభం. ఒకసారి అపార నష్టం. ఏం జరిగినా మర్నాడాయన ముఖంలో మాత్రం ముటముట.
ఒకసారి ఆయనతో పరిచయం చేసుకుని, వాళ్లింటికి వెళ్లి కాసేపు మాట్లాడి - ఆ ముఖంలో ముటముటకి కారణం తెలుసుకోవాలనిపించింది. కానీ కనిపిస్తే ముటముటలాడుతూ చూసే మనిషితో పరిచయం ఎలా?
రెండు నెల్లు గడిచాయి. నేనిప్పుడు పరబ్రహ్మం ముఖంలో ముటముటకి అలవాటు పడ్డాను. ఎంతలా అంటే, పొరపాటున ఆయన నవ్వితే కనుక అప్సెట్ ఔతానేమో!
మా ఇంటి ముందు నేరేడు చెట్టు విరగకాసింది. పెద్ద సైజు పళ్లు. రోడ్డు మీదకి ఉన్న మూలాన దారినపోయే వాళ్లు కోసుకుపోగా కూడా మాకు గినె్నల కొద్దీ వచ్చాయి. మా ఆవిడ చాలామందికి పంచి పెట్టింది. మాకూ, వాళ్లకీ పనిమనిషి యశోదే కాబట్టి పరబ్రహ్మానికీ ఓ గినె్నడు పళ్లు పంపింది.
నాకు చాలా సంతోషమైంది. మా మధ్య పరిచయానికి ఇది నాంది కావచ్చు. ‘పంపింది మనమని వాళ్లకి తెలుస్తుందా? అసలు మనమెవరో వాళ్లకి తెలుసా?’ అన్నాను అనుమానంగా.
‘ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం. వాళ్లకి మన గురించి ఎందుకు తెలియదూ? రోజూ వాకింగులో మిమ్మల్ని చూస్తానని అన్నాట్ట ఆయన’ అంది మా ఆవిడ.
ఇంతవరకూ పరబ్రహ్మం ఇంటి నుంచి మా ఇంటికేం రాలేదు. మేము నేరేడుపళ్లు పంపాం. నేనెవరో ఆయనకి తెలుసు. కాబట్టి రేపాయన నన్ను చూసి థాంక్స్ చెప్పడానికైనా నవ్వుతాడని నాకనిపించింది.
మర్నాటి కోసం ఆత్రుతగా ఎదురుచూశాను. వాకింగులో ఆయన ఎదురయ్యాడు కానీ - ముఖంలో అదే ముటముట. నవ్వకపోతే పోయె - ఆ ముటముట ఎందుకు?
ఇంటికొచ్చేక, ‘బొత్తిగా మేనర్స్ లేవు’ అని మా ఆవిడతో అన్నాను.
‘మనమేమైనా వాళ్లకి ప్రత్యేకంగా ఇచ్చామా? నలుగురితోపాటూ వాళ్లకీ పంచాం. పోనీ పెర్సనల్‌గా ఇచ్చామా అంటే అదీ లేదు. పనిమనిషి చేత పంపాం. దానికి వాళ్లు థాంక్స్ చెప్పార్లెండి. అంతటితో ఐపోయింది. మీరీ విషయం ఎక్కువ ఆలోచించొద్దు. బయట వాకింగులో ఎవర్ని చూసినా మొహమంతా నవ్వు పులుముకుని పలకరిస్తారు కానీ, ఇంట్లో నా దగ్గర మీ మొహం కూడా ఎప్పుడూ ముటముటలాడుతూనే ఉంటుంది. ఆ మాట మీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఐనా మీరు మారలేదు..’ అంది మా ఆవిడ.
నేనెప్పుడు ఎవర్ని విమర్శించినా, దానె్నలాగో అలా నా మీదకి మళ్లించే కళ మా ఆవిడకి మా పెళ్లైన ఏడాదికే పట్టుబడింది. అలాంటప్పుడు తోక ముడవడం తప్ప నాకు గత్యంతరం లేదు.
దారి మళ్లించడానికి, ‘పూర్వం పరిచయం కోసం పండో, కానుకో తీసుకెళ్లేవారు. ఇప్పుడు పండో, కానుకో ఇచ్చినా పరిచయం మాత్రం వద్దనుకుంటున్నారు’ అన్నాను.
‘ఔనండీ! ఈ బిజీ రోజుల్లో పరిచయాలు పెంచుకుంటూ పోతే మెయింటైన్ చెయ్యలేం. పరిమిత సంతానం లాగే పరిమిత పరిచయాలూనూ!’ అంది మా ఆవిడ.
బహుశా పరబ్రహ్మం ఉద్దేశమూ అదేనేమో! ఐతే మాత్రం చిరునవ్వు చిందిస్తే పరిచయాలు పెరిగిపోతాయా? నా వాక్‌మేట్స్ ఎంతమందితో - మాకు రాకపోకలేర్పడ్డాయి? పరబ్రహ్మం నవ్వడు సరికదా. మొహంలో ముటముట కూడానూ. అలాంటి పరబ్రహ్మంతో పోల్చినందుకు మా ఆవిడ మీద అక్కసు కూడా వచ్చింది.
వారం తిరక్కుండా తన అభిప్రాయం తప్పని రుజువు చేసే సమయం వచ్చింది.
పరబ్రహ్మం ఇంటికి ఎవరో కరివేపాకు పంపారుట. అంత కరివేపాకు ఏం చేసుకుంటామని కొంత మాకు పంపారా ఇంటివాళ్లు.
కరివేపాకు నేరేడు పళ్లంత విలువైనది కాదు. ఐనా మర్యాదంటే ఏమిటో పరబ్రహ్మానికి తెలిసేలా చెయ్యడానికి నేనాయన పట్ల కృతజ్ఞత చూపాలనుకున్నాను.
మర్నాడు వాకింగులో పరబ్రహ్మం నాకెదురైతే ఇంత మొహం చేసుకుని పలకరింపుగా నవ్వాను.
అప్పుడు నేనాశ్చర్యపోయే విశేషం జరిగింది.
పరబ్రహ్మం కూడా నన్ను చూసి ఇంత మొహం చేసుకుని నవ్వాడు. నా నవ్వు సంగతి తెలియదు కానీ, ఆ నవ్వు ప్రకృతి సరిగమలకూ, ఉడతమ్మ పలకరింపుకీ, పచ్చిగాలి తాకిడికీ, వగైరా వగైరాలకీ దీటుగా - చాలా మనోహరంగా ఉంది.
పరబ్రహ్మం నవ్వాడు. అదీ నన్ను చూసి పలకరింపుగా.
ఈ విషయం మా ఆవిడకి చెప్పాలి. కానీ ఎందుకు నవ్వాడంటే ఏం చెప్పను?